విద్యుత్ భారం పడకుండా అప్పులు తీర్చాలి: సీఎం చంద్రబాబు

  • ఇంధన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • ప్రజలపై భారం వేయకుండా డిస్కంల అప్పులు తీర్చాలని దిశానిర్దేశం
  • విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించాలని సూచన
  • ఇంధన రంగంలో ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ ఫండ్
  • రాష్ట్రంలో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపకుండా విద్యుత్ సంస్థల (డిస్కంల) రుణాలను తీర్చేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించే లక్ష్యంతో పనిచేయాలని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఇంధన శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా అధికారులు విద్యుత్ కొనుగోళ్ల ఖర్చు తగ్గింపుపై రూపొందించిన ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ సంస్కరణల ద్వారా 2028-29 నాటికి యూనిట్‌పై రూ.1.32 భారాన్ని తగ్గించి, కొనుగోలు ధరను రూ.4.10కి తీసుకురాగలమని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం, ధరను రూ.4కు తగ్గించేలా చూడాలని సూచించారు. సమర్థ నిర్వహణ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.339 కోట్లు ఆదా చేశామని అధికారులు తెలపగా, పొదుపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు.

ఇంధన రంగం గేమ్ ఛేంజర్
"ఉమ్మడి రాష్ట్రంలోనే దేశంలో తొలిసారిగా ఎనర్జీ ఆడిటింగ్ వంటి సంస్కరణలు తెచ్చాం. ఇప్పుడు ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తోంది. ఇంధన రంగం భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కానుంది. తక్కువ ఖర్చు, పర్యావరణ హిత విద్యుత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం కాబట్టే గూగుల్ వంటి సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి," అని చంద్రబాబు అన్నారు. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాలను ప్రజలకు, రైతులకు మరింత చేరువ చేయాలని సూచించారు. సోలార్ విద్యుత్‌లో దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలపాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఎనర్జీ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్ ఫండ్
రాష్ట్రంలో ఇంధన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఒక ‘ఎనర్జీ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లకు ఆర్థిక చేయూతనిచ్చేలా ‘ఇంక్యుబేషన్ ఫండ్’ ఏర్పాటు చేయాలని సూచించారు. "మన విద్యుత్ సంస్థలు ఇతర రాష్ట్రాలకు కన్సల్టెన్సీ సేవలు అందించే స్థాయికి ఎదగాలి. ఇప్పటికే ట్రూ అప్ భారాన్ని ప్రజలపై వేయలేదు, పైగా 13 పైసల మేర ట్రూడౌన్ చేశాం. కొనుగోలు భారాన్ని కూడా తగ్గిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Andhra Pradesh
AP Electricity
Power Sector Reforms
Energy Efficiency
Renewable Energy
Solar Power
Discom Loans
Energy University
Gottipati Ravi Kumar

More Telugu News